AP: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు మద్యం విక్రయించడం పూర్తిగా చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయని స్పష్టం చేశారు.
మద్యం విక్రయాల్లో ప్రభుత్వ నిర్దేశించిన ధరలను తప్పనిసరిగా పాటించాలని దుకాణదారులను హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని ఎక్సైజ్ అధికారులకు సూచిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా నిరంతర నిఘా ఏర్పాటు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా అధిక ధరలకు మద్యం విక్రయించినట్లు తేలితే సంబంధిత దుకాణాలపై జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది.




