తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగంలో కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించింది.
ఇవాళ సచివాలయంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు ముఖ్యమంత్రిని కలుసుకుని ‘ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ’ పేరుతో నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి, జాతీయ విద్యా విధానం తరహాలో తెలంగాణకు ప్రత్యేక విద్యా విధానం తీసుకురాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు కొత్త పాలసీకి రూపకల్పన జరిగింది.
📚 ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సంస్కరణలు
ఈ నివేదికలో పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యత పెంపు, విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, ఆధునిక బోధనా పద్ధతుల ప్రవేశం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం.
🛍️ వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు?
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2024లో తెలంగాణ విద్యా కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను సిద్ధం చేసింది. నివేదిక అందిన నేపథ్యంలో త్వరలోనే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి ఈ కొత్త విద్యా విధానం అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.





