తెలంగాణలో కీలక ప్రాజెక్ట్ అయిన SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ) ఇన్లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమైనట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే దేవరకొండ ప్రాంతం నుంచి ఔట్లెట్ పనులు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం రెండు వైపులా నిరంతరాయంగా తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రాజెక్ట్ పురోగతిపై మంత్రి అధికారులతో సమీక్షించారు. పనులు వేగవంతంగా కొనసాగించడంతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సొరంగ మార్గంలో గాలి, వెలుతురు సక్రమంగా వచ్చేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నీటి సరఫరా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు రైతులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ పనులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.




